Monday, January 29, 2007

సుందర కాండ తొమ్మిదవ సర్గ

అంతట హనుమ ముందుకు సాగి
వరుస ఇళ్ళుగల స్థలము చేరెను
అన్నిటికన్న మిక్కిలి పెద్దదగు
ఒక భవనమును అక్కడ చూసెను 1

రావణ భవనమది
యోజనము ఎత్తు గలది
అందులో సగము నిడివి గలది
అన్ని హంగులు అమరియున్నది 2

విదేహ రాజ్యపు రాజ కుమారి,
అతి సుకుమారి, సీతా సాధ్వి
హనుమ తిరిగెను అన్ని దిసలకు
ఆమె జాడకై వెదకి చూసెను 3

రాక్షస గృహములు వెదకిన పిమ్మట
హనుమ చేరెను రావణ మందిరము
అచట చూసెను, ఆయుధ పాణులను
రెండు, మూడుయు నాలుగు దంతములుగలిగి
అతి భయంకరమగు శిక్షణ కలిగిన
శత్రు సూదనలో నిష్ణాతులను 45

చేపలు, సొరలు, మొసళ్ళతోను
పాముల్లతోను నిండిన సాగరము వలె
రావణ మందిరము నిండి వుండెను
బలముతొ తెచ్చిన అతని భార్యలతో 67

కుబేరుని మించిన ధనరాసులతోను
ఇంద్రుని మించించ పచ్చని అస్వ సంపదతోను
అసలు తరగ అక్షయమగుచు
రావణ మందిరము నందే గలదు 8

యక్షుల రాజగు కుబేరుని సంపద
యముని మరియు వరుణుని సంపద
కలిపిన మొత్తము కన్న మించిన
సంపద రావణ సముఖమునున్నది 9

అమిత బలము గల మదపుటేనుగులు గల
మరి ఒక భవనము మారుతి చూసెను 10

ఏ విమానమును
విశ్వకర్మ బ్రహ్మకై మలచెనో
బ్రహ్మ కుబేరునికొసగెనో
రావణుడు కుబేరునోడించి గెలిచెనో
వివిధాలంకృత భూషితమై వెలుగొందునో
పుష్పకమని పేర భాసిల్లు చుండునో
అట్టి విమానమును
హనుమ అచ్చెరువంది చూచు చుండెను 12

తోడేళ్ళ శిల్పములు చెక్క బడిన
స్థంభముల బాసట గలిగి
వెండి బంగారు రంగుగల
కాంతి కిరణాలు గలిగి 13
మేరు మందర గిరులకు
సరిబోలు అలంకారము గలిగి
ఆకాశపుటంచులు తాకు
ఉన్నత సిఖరములు గలిగి 14

సూర్య తేజస్సును మించిన అగ్నుల
వెలుగులనుబోలు మెరుపులు గలిగి
బంగారు సోపానములు,
అతి సుందర తలములు గలిగి 15

నవ రత్నములు పొదిగిన
బంగారు కవాటములు గలిగి
నీలము పచ్చలు పొదిగిన
రచ్చ బండలు గలిగి 16

పగడపు పుప్పొడి చల్లిన
కాంచన సొగసుల పువ్వులు గలిగి
ముత్యపు దండల మెరుగులు
వింత కాంతుల మణులను గలిగి 17

పగడపు ఎర్రటి కాంతులతో
బంగారు వన్నెల తళుకులతో
గంధపు చెక్కల పరిమళములతో
మధ్యాన్న సూర్యుని వలే
పుష్పకము విలసిల్లు చుండెను 18

అట్టి మహత్తరమైన పుష్పకమును
హనుమ ఆనందమున అధిరోహించెను 19


ఇంతలో హనుమ ముక్కులకు
అతి మధురముగ, నోరూరగ
ఆకలి కలిగించెడి, రుచికర భోజనముల
సుగంధములు గాలిలొ తాకుతు తగిలినవి 20

అతి బాంధవుడొకడు రారమ్మనుచు
రావణ మందిరమునకు దారిచూపు నటుల
ఆ మదుర సుగంధ గాలులు అదిగో అన్నట్లుగ
హనుమకు తోచెను ఆనందించెను 21

అటులే అన్నట్లు ఆవైపు నడిచెను
నవ యవ్వన కోమలి వలె అగుపడు,
రావణ మనముకు అతి ప్రియతమమగు
సుందర సువిశాల శాలను చూసెను 22

అందలి సోపానములు వజ్ర భూషితములు
కాంచన నిర్మిత కవాట ఘట్టములు
స్ఫిటికము మలచిన సుందర తలములు
దంతములో చెక్కిన అద్భుత చిత్తరువులు 23

ముత్యాలంకరణములు పగడపు సోపానములు
వెండి బంగారు తొడుగుల స్తంభములు
వజ్రములు పొదిగిన అలంకరణములు
కన్నులు చెదిరే సంపద రాసులు 24

విశాలమైనవి అతి బలమైనవి నగు
రెక్కలు, స్తంభములకిరుపక్కల
చిత్ర విచిత్రాలంకారముల వెలుగులతో
భాసిల్లెడి భవనమును మారుతి చూసెను 25

కొండలు, నదులు, అడవులు సముద్రముల
బొమ్మలు కల విలువగు తివాచీ మెరుగులతో
వివిధ భవన సమూహములతో నిండిన
మరో భూగోళము వలె భాసిల్లు చుండెను 26

పక్షుల కిల కిలలతో మార్మోగుతు
సుగంధ సువాసనలతో మత్తెక్కిస్తు
సుందర అలంకరణ విలసిల్లుతు
రాక్షస రాజుకు ఆశ్రయ మైనదాగృహము 27

అగరు పొగలతో నిండినదై
తెల్లని హంస వలె కనిపించుతు
పూల సౌరభాలంకృతయై దివ్య జ్యోతుల
కామ ధేనువు వలె కనిపించెను 28

తెల్లని వెలుగులతో చక్కని సుగంధములతో
మనసులోని బాధలను పోగొట్టునట్లు
చూపరులకు మానసోల్లాసమును కల్గించునట్లు
ఆ భవనము కనిపించు చుండెను 29

మనసుకు హాయి నిచ్చే అమ్మలా
కళా కాంతులతో నిండిన దైన,
రావణ గృహమగు ఆ భవనము
పంచేంద్రియాలకు హాయి నిచ్చుచుండెను 30


భవన సోభకు తనను మరచిన
హనుమ తనలో ఇట్లు తలచెను
"ఇంద్ర భవనమిది, దేవ నిలయమిది
సౌర్యులకే ఇది దక్క గలిగినది " 31

జూదమున ఓడిన జూదరి ముఖమువలె
కాంతి తగ్గి వెలుగు చున్న కాంచన
దీపా వళులను హనుమ చూచి
హనుమ ఇట్లు తలచెను అంతరంగమున 32

"మంద్రముగా వెలుగు దీపముల చేతను
రావణుని పరాక్రమము చేతను
రాసులు పోసిన మణుల చేతను
ఎమి సుందరముగా వెలుగు తున్నదీ భవనము?" 33

ఇంతలో ప్రక్క గదిలో హనుమ చూసెను
వేల కొలదీ సుందర కాంతలు,
వివిధ రంగుల వారి దుస్తులు
మేలు రకమగు వేష భూషలు 34

రాత్రి అంతా ఆట పాటలతొ
అలసి వాలిన సుందరీ మణులను
తప్ప తాగి మత్తు పెరిగి
తూలి సొలసిన భామినీ గణములను 35

సద్దు చేయక వారి నిద్రకు
భంగ మవ్వని వారి సొత్తులు
కలువ నిండిన కొలను లోపల
ప్రశాంత హంసల పోలి వుండెను 36

పలు వరుస కప్పెడి లేత పెదవులు
రెప్ప వాల్చిన కలువ కన్నులు
కలిగి సోలిన పద్మ గంధుల నడుమ
హనుమ వెదకెను కన్నులార్పక 37

రాత్రి సమయమున వారి ముఖములు
ముడుచుకున్న కలువల వలెను
సూర్య కాంతికి విచ్చుకుని విరబూసిన
కలువల వలె హనుమకగుపించు చుండె 38

వెల్లి విరిసిన పద్మ ముఖములను చూసి
పద్మములవి యని భ్రమలొ పడిన
భ్రమర గుంపులు తిరుగు చుండెను
వారి చుట్టూ అలుపులెరుగక 39

వారి అందము, పద్మ గంధము
ఇంద్ర జాలము చేయు చందము
కలువ కొలనదని భ్రాంతి చేయుచు
ఉన్న వైనము హనుమ చూసెను 40

అందమగు సుందరాంగులు
నిండి వున్న రావణ సౌధము
తారల కాంతి తొ మెరసి పోవు
విశాల గనము పోలి వెలిగెను 41

భామ లందరు చెంత నుండగ
వారి మెరుగుల కాంతి మధ్యన
ఎన్నో తారలు చెంత వెలిగెడి
చంద్రుడా? అనిపించె రావణుడు 42

"రాత్రి చీకటి నడుమ నింగిన
రాలి పడెడి మేటి తారల
మంచి గుంపులు ఇచట చేరి
రావణాంతహ్‌పురమునందున
సేవ చేయుచు తిరుగు చుండెను !"
అని హనుమ మదిన తలచెను 43

వారి ఆభరణ తళుకులతొ
మేని చాయల మెరుపులతొ
కలువ కన్నుల చూపులతొ
తారాకాంతికి సమమై ఉండిరి 44

వాడిపొయిన పూలదండలు
విసర బడిన వారి గొలుసులు
మధువు మత్తుతొ ఆద మరిచి
నిద్ర కొరిగిన సుందరాంగులు 45

నుదుటి తిలకము చెరిగిన వారు
కాలి అందెలు జారిన కొందరు
మెడన హారము లూడిన భామలను
హనుమ చూచుచు ముందుకు సాగెను 46


ముత్యపు గొలుసుల మెడలకు గలిగి
బంగరు వద్ధాణము నడుమ తొడిగి
అలసి ఆగిన ఆడ హయము వలె
నిలచి కనపడిరాంజనేయునకు 47

మరులు గొలిపే చెవికి కమ్మలు
వాడి వీడిన పూల దండలు
మదపుటేనుగు వలన చెదిరిన
చెట్టు చేమల వలెనగుపడె 48

చంద్ర కాంతితో వెల్లి విరిసిన
మంచి ముత్యపు దండ ఒక్కటి
పెద్ద వక్షోజముల నడుమ
నిద్ర పోయెడి హంసగ అగుపడె 49

గోమేధికము మెడన దాల్చిన
కొందరు యువతులు కదంబముల వలె
బంగారు గొలుసులు యెదన చేర్చిన
కొందరు యువతులు చక్రవాకుల వలె
వింత శోభల కంటికిన్పుగ నున్న
దృశ్యము హనుమ చూచెను 50

భామల తిన్నెలు పోలు పిరుదులు,
హంసలుండెడి నదుల లాగ
కరంద చక్రవాక పక్షులు నిండిన
నదీ తీరము వలె వెలుగు చుండెను 51

యువతుల నవ్వులు పువ్వులు గాను
ఉవిదల నగలు కలువలు గాను
చెలియల చేశ్ఠలను మొసళ్ళుగాను
వారి అందమును తీరము గాను
తలచిన హనుమకు అచ్చెరువయ్యె 52


సున్నితమగు ఆ నడుము మడతలు
బహిర్గతమగు ఆ స్ఠనముల ఎత్తులు
కొందరు వనితల కుచ ద్వయములు
ఆభరణాలుగ మారుతి తలచెను 53

నిట్టూర్పుల గాలికి పమిటల అంచులు
ఎగురుతు తాకెను భామల ముఖములు
సున్నిత ముఖమున మెత్తటి చీరెలు
చిన్నగ జారెను హనుమది చూసెను 54

వివిధ రంగు గల కోమలి పమిటెలు
రావణ భార్యల మెడలపై ఎగురుతు
రెప రెప ఎగిరెడి ధ్వజముల వలె
అతి సుందరముగ గోచరించెను 55

సుందర యుగతుల శ్వాశల గాడ్పులు
తగిలిన కమ్మలు గణ గణ మ్రోగెను
వేదికి తాళక మగ్గిన బుగ్గలు
మారుతి చూసెను సుందర దృస్యము 56


రావణుడిచ్చిన మధువు గ్రోలిన
మత్తెక్కిన మగువల మగత నిట్టూర్పులు
పరిసర సుగంధ వాసనల మిళితమై
భవన మంతయు ఆక్రమించి ఉండెను 57

మత్తెక్కి స్థిమితము లేని రాన్వణ భార్యలు
తోటి వారిని తమకములో తడుముతూ
తెలివి లేక తమ ప్రియ సఖుడన్న తలపుతో
పదే పదే తమకమున ముద్దిడు చుండిరి 58

రావణునిపై మనసు నిలిపిన కొందరు
అస్థిమితమైన చేశ్ఠలతో ఇతరులను
తోటి సవతులను తమకముతో తడుముతు
వారికి వింత అనుభూతులందించు చుండిరి 59

కొందరు యువతులు తమ సున్నితమైన
వివిధ ఆభరణములతో అలంకృతమైన
తామర తూడలవంటి వారి చేతులను
దిండువలే తలనానించి నిదురించు చుండిరి 60

కొందరికి వేరొకరి పిరుదులు దిండులు కాగ
మరి కొందరికి పరుల వక్షములు ఆశ్రయమిచ్చె
సవతుల తొడలపై తలనానించిన వారు కొందరు
మరొకరి భుజముల నాక్రమించిన వారు కొందరు 61

తమకమున వేడెక్కిన తనువులకు సేద తీర్చగ
తోటి సవతుల తొడలను, వారి నడుములను
సున్నితమగు పొడవైన కాళ్ళు, చేతులను
ఆశ్రయించి నిదురించిరా భామా మణులు 62

కామ క్రీడల అలసి సొలశిన
భామల వరుసలు భవనము నందున
పూల చెండులు అల్లిన విధముగ
హనుమకు అగుపడె అతి సుందరముగ 63


యువతీ గణముల చేతుల అల్లికతో
వికసించిన పువ్వుల దండలవలెను
విరహమున వీడిన భామల జడలు
వైశాఖాన విరిసిన పచ్చని 64
చెట్లకు పాకిన లతల వలెను
రావణ మందిర సుందర శోభలు
భామల నవ్వుల ఆనంద హేలలు
విస్మయమై చూసెడి హనుమకు అగుపడె 65

యువతుల సుందర అంగములేవో
భామలు కట్టిన వలువలు ఏవో
ఇంతుల బంగరు ఆభరణములేవో
పరికించినా పట్టుట కష్టము 66

బంగరు కాంతితో వెలిగెడి దివ్వెల
భామల నిద్రలొ విరిసెడి నవ్వుల
నడుమన సోలినె రావణ భూపతి
మగత నిద్దురలొ చూచునట్లుండెను 67

రాజర్షుల బిడ్డలు, బ్రహ్మణ యువతులు
దేవ కన్యలు, గంధర్వ సుతలు
రాక్షస కూనలు మోహము కమ్మి ,
ఈ అసురుని సరసకు లోబడి చేరిరి 68

రావణ మోహన రూపము మదిలో మెదలగ
ప్రేమతో లోబది కొందరు వచ్చిరి
యుద్ధమునోడిన పతులవు వీది
అసురుని సరసకు కొందరు చేరిరి 69

అక్కడ చేరిన యువతులు ఎవరూ
వేరొక పురుషుని మనమున తలవరు
యువతుల ఇచ్చెకు వ్యతిరేకముగ
అక్కడకొచ్చిన వారునూ లేరు
అసురుడు చేసిన మాయకు లోబడి ,
ఆమె మనసుకు ప్రతిగా తేబడి,
మనమున రాముని తలపుతొ నిలబడి
వుండెడి ఆమె సీత ఒక్కటేనని
మారుతి తలచుచు ముందుకు సాగెను 70

వారికి మించిన కోర్కెలు గల్గించు వారు
మంచి వంశమున పుట్టని వారు
సుందరతలో మించిన వారు
మంచి నేర్పరులు, బుద్ధి కుశలురు లేరు 71

రావణ శోభను అన్నిట చూచుచు
హనుమ మనమున ఈవిధి తలచెను
"రావణుడంతటి పరాక్రమ వంతుడు
వక్రపు బుద్ధితొ ఆలోచించెను 72

సీత అంతటి పరమ సాధ్విని,
లంకకు తెచ్చి తప్పును చేసెను
ఆమెకు తీరని లోటును చేసెను,
తప్పక, తప్పుకు శిక్షను పొందును. 73



===============================

No comments: